EPFO: ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా... ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్
- చందాదారులకు అందుబాటులోకి మరింత సులభతర విధానం
- ఏటీఎం వద్ద నగదు ఉపసంహరణకు అవకాశం
- కార్మిక శాఖ సెక్రటరీ సుమితా దావ్రా ప్రకటన
ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్! పీఎఫ్ ఖాతాలోని నగదును మరింత సులభంగా ఏటీఎం వద్ద విత్‌డ్రా చేసుకునే విధానం అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు కార్మిక శాఖ సెక్రటరీ సుమితా దావ్రా బుధవారం కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈపీఎఫ్‌వో చందాదారులు తమ పీఎఫ్ ఫండ్‌ను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని వెల్లడించారు.
క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరంగా, వేగవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు. ఒక క్లెయిమ్‌దారు, లబ్ధిదారుడు లేదా బీమా కలిగివున్న వ్యక్తి చిన్నపాటి ప్రక్రియ ద్వారా ఏటీఎంల వద్ద సౌకర్యవంతంగా క్లెయిమ్‌లను పొందవచ్చని వివరించారు.
దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న శ్రామికశక్తికి అందాల్సిన సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈపీఎఫ్‌వో ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతి రెండు మూడు నెలలకోసారి అప్‌డేట్ చేస్తుంటామని, జనవరి 2025 నాటికి ఒక పెద్ద అప్‌డేట్ వస్తుందని సుమితా దావ్రా విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించే ప్రణాళికలపై ప్రశ్నించగా... పురోగతి దశలో ఉన్నాయని అన్నారు. ప్రణాళికలకు సంబంధించిన వివరాలను పేర్కొనలేదు. అయితే హెల్త్ కవరేజ్, ప్రావిడెంట్ ఫండ్స్, వైకల్యం కలిగిన సమయంలో ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు, దేశంలో నిరుద్యోగ రేటు తగ్గిందని సుమితా దావ్రా తెలిపారు. 2017లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుతం 3.2 శాతానికి తగ్గిందని ఆమె వెల్లడించారు. ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. కాగా ఈపీఎఫ్‌వోకు మొత్తం 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు.