Ambati Rambabu: అంబటి రాంబాబు సోదరుడికి షాక్.. షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వం

Officials Ready To Give Shocks To Ambati Murali Krishna

  • గుంటూరులోని పట్టాభిపురంలో గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న అంబటి మురళీకృష్ణ
  • రైల్వేశాఖ నుంచి జీ ప్లస్ 4కు మాత్రమే అనుమతి
  • అగ్నిమాపకశాఖ, పీసీబీ నుంచి కూడా సరైన అనుమతులు తీసుకోని వైనం
  • గత నెల 18న నిర్మాణదారుడికి షోకాజ్ నోటీసులు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు, పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జ్ మురళీకృష్ణకు షాక్ ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. గుంటూరులోని పట్టాభిపురంలో ఆయన నిర్మించిన గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌కు నగరపాలక, రైల్వే, అగ్నిమాపకశాఖ, పీసీబీ నుంచి పూర్తిస్థాయి అనుమతులు తీసుకోలేదన్న కారణంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. దీనికి ఆయన స్పందించకపోవడంతో దానిని కూల్చడం, లేదంటే సీజ్ చేయడం, లేదంటే ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు వెళ్లడంలలో ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌కు జీ ప్లస్ 4కు మాత్రమే రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, అనుమతులను ఉల్లంఘించి అంతకుమించి అంతస్తులు నిర్మిస్తున్నట్టు గతేడాది గుర్తించిన రైల్వే ఎన్‌వోసీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మాణంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర ప్రశ్నించడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. పలు ఉల్లంఘనల నేపథ్యంలో గత నెల 18న షోకాజ్ నోటీసులు పంపిన నగర పాలక సంస్థ అధికారులు గతంలో ఇచ్చిన అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కోరింది. మరోవైపు, రైల్వేశాఖ ఎన్‌వోసీ ఇవ్వడం లేదంటూ నిర్మాణదారుడు హైకోర్టును ఆశ్రయించడంతో రెండువారాల వరకు నిర్మాణాలపై ఎలాంటి చర్యలు వద్దని నగరపాలక సంస్థను హైకోర్టు ఆదేశించింది.  

More Telugu News