Syria: సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
- సిరియాను తిరుగుబాటు దళాలు తమ నియంత్రణలోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు
- ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు
- ఇందులో భాగంగా 75 మంది భారతీయ పౌరులను డమాస్కస్ నుంచి లెబనాన్‌కు తరలింపు
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను తిరుగుబాటు దళాలు గద్దె దించి అధికారాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో ఉంటున్న భారత పౌరులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
దీనిలో భాగంగా 75 మంది భారతీయులను డమాస్కస్ నుంచి లెబనాన్‌కు తరలించడం జరిగింది. భారతీయ పౌరులు సురక్షితంగా లెబనాన్‌కు చేరుకున్నారని, వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సిరియాలోని భారతీయ పౌరుల అభ్యర్థనలు, అక్కడి భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తరువాత మనోళ్ల తరలింపునకు సంబంధించిన నిర్ణయం తీకుంది. డమాస్కస్, బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయాలు దీనికి సహకరించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇక తాజాగా తరలించిన 75 మందిలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన 44 మంది 'జైరీన్' (యాత్రికులు) ఉన్నారు. వారు సైదా జైనాబ్ వద్ద చిక్కుకుపోయారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే, కొంతమంది భారతీయులు సిరియాలోనే ఉంటున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973, hoc.damascus@mea.gov.in ఇమెయిల్ ద్వారా టచ్‌లో ఉండాలని ప్రభుత్వం వారికి సూచించింది.