Sharad Pawar: ఈవీఎంలపై అనుమానాలు.. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి!
- శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ భేటీలో నిర్ణయం
- త్వరలోనే ఢిల్లీ ఎన్నికలు.. ముందస్తు ప్రణాళిక అవసరమని భావన
- ఈవీఎంలను సమర్థిస్తున్న సుప్రీంకోర్ట్
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఈవీఎం మెషిన్లపై ఇండియా కూటమి నేతల ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. అవకతవకలు, అనుమానాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూటమి నిర్ణయించింది. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శరద్ పవార్, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్య మంగళవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలోని హడప్సర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎన్సీపీ-శరద్ పవార్ నేత ప్రశాంత్ జగ్తాప్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడికి అనూహ్య పరాభవం ఎదురైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈసారి ముందస్తు ప్రణాళిక అవసరమని భావిస్తున్నట్టు కూటమి వర్గాలు చెబుతున్నాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ గెలిచింది. అయితే, ఈసారి ఏకపక్ష విజయం సాధ్యం కాకపోవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఈసారి విపక్ష బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఈవీఎం యంత్రాలను సుప్రీంకోర్టు గట్టిగా సమర్థిస్తోంది. సమర్థవంతంగానే పనిచేస్తున్నాయని చెబుతోంది. తమరు ఓడిపోతేనే సందేహాలా?, గెలిచినప్పుడు ట్యాంపరింగ్ జరగలేదా? అని విపక్ష పార్టీలను ఇటీవలి విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు మందలించారు. మరి ఇండియా కూటమి పిటిషన్లు దాఖలైతే సుప్రీంకోర్ట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.