Natti Kumar: మోహన్ బాబు కుటుంబానికి ఏదో నర ఘోష తగిలినట్టుంది: నిర్మాత నట్టి కుమార్

Natti Kumar talks about Mohan Babu family issue

  • మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల రగడ!
  • గత కొన్ని రోజులుగా నిత్యం మీడియాలో మోహన్ బాబు ఇంటి విషయాలు
  • ఇవాళ కూడా ఉద్రిక్తతలు
  • ఈ పరిణామాలు దురదృష్టకరమన్న నట్టి కుమార్

మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన చిచ్చుపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. మోహన్ బాబు కుటుంబానికి ఏదో నర ఘోష తగిలినట్టుందని అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో మంచు కుటుంబానికి మంచి పేరుందని, కానీ ఇలాంటి పరిణామాలు దురదృష్టకరమని అన్నారు. ఇదొక దుమారం తప్ప, మరేమీ కాదని, ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని తెలిపారు. 

"వచ్చే ఏడాది మోహన్ బాబు కెరీర్ కు 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. విలన్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగి, విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండస్ట్రీలో ఒక పులి లాంటి వ్యక్తి మోహన్ బాబు. దాసరి నారాయణరావు తర్వాత ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి మోహన్ బాబు మాత్రమే. ఇది అందరూ ఒప్పుకునే విషయం. 

ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకుంటారని మంచు కుటుంబానికి మంచి పేరుంది. మనోజ్ కూడా చాలా మంచి వ్యక్తి. విష్ణు, మంచు లక్ష్మి కూడా మంచి వ్యక్తులు. ఇతరులకు సహాయపడడంలో ముందుండే వ్యక్తులు వాళ్లు. ఇలాంటి చిన్న చిన్న గొడవలు అందరి కుటుంబాల్లో ఉంటాయి. 

ఈ వివాదాల్లో ఎలా వ్యవహారించాలనేది ఇతరులు ఆయనకు చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దాసరి నారాయణరావు గారే. ఆయన ఇప్పుడు లేరు. కాబట్టి, ఆయన కుటుంబంలో సమస్యను పరిష్కరించే శక్తి ఇంకెవరికీ లేదు. తన కుటుంబంలో వివాదాన్ని ఒక్క మోహన్ బాబు మాత్రమే పరిష్కరించుకోగలరు. 

మంచు మనోజ్ కు, విష్ణుకు, లక్ష్మికి చెబుతున్నాను... మీ నాన్న గారు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని సినీ ప్రముఖులతో పాటు మీరందరూ కూడా దగ్గరుండి జరిపించాలి. ఇలాంటి చిన్న చిన్న వివాదాలకు స్వస్తి పలికి... 50 ఏళ్లుగా ఎంతో క్రమశిక్షణతో మెలిగి ఆయన సంపాదించుకున్న పేరును మీరు నిలబెట్టాలి. అందరి తరఫు నుంచి మోహన్ బాబు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను... ఈ గొడవకు ఇంతటితో స్వస్తి పలకాలి" అని నట్టి కుమార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News