Telangana: తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తిరస్కరిస్తున్నాం: కవిత

Kavitha rejected new model of Thalangana Thalli

  • తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన కవిత
  • ఉద్యమ తల్లే తమ తల్లి అని స్పష్టం చేసిన కవిత
  • తెలంగాణ సంస్కృతి చిహ్నం బతుకమ్మను తొలగించడంపై ఆగ్రహం

సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తాము తిరస్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం దారుణమన్నారు. బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ అని, అలాంటి బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. గ్రాండ్‌గా ఉండే తెలంగాణ తల్లిని తీసి... బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. విగ్రహం నమూనాను మార్చినందుకు నిరసనగా పాలాభిషేకం చేస్తున్నట్లు చెప్పారు.

ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చడం సరికాదన్నారు. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండుతాయని... కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది అన్నారు. అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తొలగించారన్నారు.

తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలని పేద తల్లి విగ్రహం పెట్టారా? అని ఎద్దేవా చేశారు. విగ్రహం పెట్టామనే పేరుతో సామాన్యులకు ఇచ్చే హామీలను ఎగ్గొడతారా? అని నిలదీశారు. తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిందని, మరి ఆ జాబితాలో మహిళలకు స్థానం ఎందుకు లేదో చెప్పాలన్నారు.

More Telugu News