Rajya Sabha Elections: రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసిన కూటమి అభ్యర్థులు
- ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు
- నిన్న కూటమి అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు
- నామినేషన్ వేసిన బీదా మస్తాన్ రావు, సానా సతీశ్, ఆర్.కృష్ణయ్య
- ఏకగీవ్రంగా ఎన్నిక కానున్న కూటమి అభ్యర్థులు
ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు సీఎం చంద్రబాబు నిన్న కూటమి తరఫున అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీశ్, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య కూటమి తరఫున బరిలో దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో, కూటమి అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలను పెద్దల సభలో లేవనెత్తుతామని తెలిపారు.
కాగా, కూటమి అభ్యర్థులకు మద్దతుగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా తరలి వచ్చారు. ఖాళీగా ఉన్న ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.