Manchu Family Conflict: జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత!
- గంటకో మలుపు తిరుగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం
- విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ
- ఈ నేపథ్యంలో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం
హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకుని బయటకు తోసేశారు.
తండ్రీకొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇప్పటికే పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంచు విష్ణు దుబాయి నుంచి ఇంటికి రాగానే మరోసారి వివాదం చెలరేగినట్లు సమాచారం. విష్ణు రావడంతో అతని బౌన్సర్లు భారీ సంఖ్యలో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు.
ఆ తర్వాత మనోజ్ బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఈ క్రమంలో ఇరువురి బౌన్సర్ల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మనోజ్ బౌన్సర్లు, అనుచరులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని విష్ణు బౌన్సర్లు, అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇలా మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది.