KTR: తెలంగాణ తల్లిని అవమానించినందుకు రేపు ఈ రెండు చేద్దాం!: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

KTR call to BRS leaders to protest over new Telangana Thalli model

  • 2007లో ఉద్భవించిన తెలంగాణ తల్లిని డీపీగా పెట్టుకుందామని పిలుపు
  • అలా చేస్తే ఎవరేం చేస్తారో చూస్తామని సవాల్
  • రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని పిలుపు

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానించిందని, అందుకు గాను రేపు రెండు పనులు చేద్దామని బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 2007లో ఉద్భవించిన తెలంగాణ తల్లిని మనం డీపీగా పెట్టుకుంటే ఎవరేం చేస్తారో చూద్దామన్నారు.

"బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులందరికీ... రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రెండు పనులు చేద్దాం. కచ్చితంగా తెలంగాణ తల్లిని 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలో నుంచి ఉద్భవించిందో... సోషల్‌ మీడియా, వాట్సాప్‌ డీపీల్లో తెలంగాణ తల్లి బొమ్మను డీపీగా పెట్టుకుందాం.. ఎవడు ఏం పీకుతడో చూద్దాం" అని సవాల్ చేశారు.

"మనం చేయబోయే రెండో పని... రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నచోట కాంగ్రెస్ చేసిన అపచారానికి గాను పాలాభిషేకాలు చేద్దాం" అని పిలుపునిచ్చారు. అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దామని, జరిగిన తప్పుకు క్షమాపణలు అడుగుదామన్నారు. ఈ కాంగ్రెస్‌ మూర్ఖులకు చరిత్ర తెలియదు... ఈ సన్నాసులను క్షమించమని ఆ తల్లిని కోరుకుందామని వ్యాఖ్యానించారు.

More Telugu News