Kakinada Port Issue: పవన్ కల్యాణ్ ఆ నౌకను ఆపిన స్ఫూర్తి ఎంతో ముఖ్యం: లంకా దినకర్
- కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు
- సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
- కాకినాడ పోర్టు నుంచి భారీగా బియ్యం తరలిపోయిందన్న దినకర్
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్టులో తనిఖీలు, ఓ షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం... తదితర అంశాలపై బీజేపీ నేత లంకా దినకర్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బియ్యం ఎక్స్ పోర్ట్ చేస్తున్న నౌకను అడ్డుకోవడం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఆ స్ఫూర్తి ఎంతో ముఖ్యమని అన్నారు.
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో మాఫియా దురాగతాలకు అడ్డుకట్ట పడుతుందని లంకా దినకర్ స్పష్టం చేశారు. సిట్ వేయడంతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారని వ్యాఖ్యానించారు.
పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో నాడు ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం అందించారని, ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ కోసం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కార్యక్రమం తీసుకువచ్చారని వివరించారు. కొవిడ్ సమయంలో పేదల ఆకలిని తీర్చడం కోసం రెట్టింపు బియ్యం అందిస్తే... కాకినాడ పోర్టు నుంచి రెట్టింపు బియ్యం విదేశాలకు తరలిపోయిందని లంకా దినకర్ ఆరోపించారు.
సిట్ నివేదిక అనంతరం బియ్యం అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.