Syria Crisis: సిరియా సంక్షోభంపై భారత్ ఏమన్నదంటే....!

India reacts on Syria crisis

  • సిరియాను వీడి రష్యాకు పారిపోయిన దేశాధ్యక్షుడు అసద్
  • సిరియా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్న భారత్
  • సిరియాలోని భారత పౌరుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి

పశ్చిమాసియాలో ఎప్పటి నుంచో సంక్షుభిత పరిస్థితులు ఉన్న దేశాల్లో సిరియా ఒకటి. సుదీర్ఘకాలంగా ఇక్కడ అంతర్యుద్ధం నడుస్తోంది. తిరుగుబాటుదారులకు భయపడి దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోవడం సిరియాలో నెలకొన్న సంక్షోభానికి పరాకాష్ఠ. 

అంతర్జాతీయ సమాజం సిరియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. తాజాగా, సిరియా అంశంపై భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సిరియాలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సిరియాలో మళ్లీ స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటున్నామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

సిరియా సార్వభౌమత్యం, ప్రాదేశిక సమగ్రత, ఐక్యతను పరిరక్షించుకునేందుకు అక్కడి అన్ని పార్టీలు కలసికట్టుగా పనిచేయాలని సూచించింది. అంతిమంగా సిరియా ప్రజల మనోభావాలకు అనుగుణంగా శాంతిస్థాపన జరగాలని, ఆ మేరకు రాజకీయ ప్రక్రియ ఉండాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. 

ఇక, సిరియాలో ఉన్న భారత పౌరుల భద్రత కోసం, రాజధాని డమాస్కస్ నగరంలోని భారత దౌత్య కార్యాలయాన్ని అన్ని వేళలా తెరిచి ఉంచుతున్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది.

Syria Crisis
India
Bashar Al-Assad
President
  • Loading...

More Telugu News