Venkatesh Iyer: పీహెచ్ డీ చేస్తున్న భారత క్రికెటర్
- ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- చదువు ప్రాముఖ్యత గురించి వివరించిన డాషింగ్ క్రికెటర్
- క్రికెటర్లకు ఆటతో పాటు చదువు కూడా ఉండాలని వెల్లడి
- జీవితాంతం క్రికెట్ ఆడుతూ ఉండలేమని వ్యాఖ్యలు
- చివరి వరకు తోడు ఉండేది విద్య అని స్పష్టీకరణ
ఐపీఎల్ మ్యాచ్ లు చూసేవారికి వెంకటేశ్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైనమిక్ గా బ్యాటింగ్ చేయడమే కాదు, పార్ట్ టైమ్ బౌలర్ కూడా. ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ వెంకటేశ్ అయ్యర్ ను వేలానికి రిలీజ్ చేసి, మళ్లీ రూ.23.75 కోట్లకు కొనుగోలు చేయడంతో అతడి పేరు భారత క్రికెట్ వర్గాల్లో మార్మోగిపోయింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ బ్యాట్స్ మన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం తాను ఫైనాన్స్ సబ్జెక్టుతో పీహెచ్ డీ చేస్తున్నట్టు వెల్లడించాడు. ఈసారి తనను ఇంటర్వ్యూ చేసే సమయానికి డాక్టర్ వెంకటేశ్ అయ్యర్ ను అవుతానని చమత్కరించాడు.
క్రికెట్ ఆటగాళ్లు కేవలం క్రికెట్ నాలెడ్జ్ కే పరిమితం కాకుండా, ఇతర విషయాల్లోనూ పరిజ్ఞానం పెంచుకోవడం అవసరమని వెంకటేశ్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. పీజీ వరకు, కనీసం డిగ్రీ వరకైనా క్రికెటర్లు చదువుకోవాలని అభిప్రాయపడ్డాడు. మధ్యప్రదేశ్ రంజీ టీమ్ లోకి ఎవరైనా కొత్త ప్లేయర్ వస్తే... చదువుకుంటున్నావా? అని తప్పకుండా అడుగుతానని వెల్లడించాడు.
జీవితాంతం క్రికెట్ ఆడుతూ ఉండలేమని, కానీ విద్య మనతో చివరి వరకు ఉంటుందని స్పష్టం చేశాడు. ఆటలోనే కాదు, జీవితంలోనూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి విద్య ఉపయోగపడుతుందని అన్నాడు.
తాను 2018లో ఫైనాన్స్ సబ్జెక్టుతో ఎంబీయే చేశానని, ఆ తర్వాత డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలో జాబ్ కూడా వచ్చిందని వెంకటేశ్ అయ్యర్ వెల్లడించాడు. అయితే, క్రికెట్ పై దృష్టి సారించడం కష్టమని జాబ్ ఆఫర్ కు నో చెప్పానని తెలిపాడు.