Chalo Delhi: 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం విరమించుకున్న రైతులు
- పంటలకు మద్దతు ధర చట్టబద్ధం చేయాలంటున్న పంజాబ్ రైతులు
- ఛలో ఢిల్లీ కార్యాచరణకు పిలుపు
- గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో శంభు వద్ద ఉద్రిక్తతలు
- ఇవాళ రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
- పలువురు రైతులకు గాయాలు
పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని కోరుతూ పంజాబ్ రైతులు తలపెట్టిన 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. ఇవాళ కూడా ఢిల్లీ సరిహద్దుల్లో శంభు వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ముందుకు చొచ్చుకువస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు రైతులు గాయపడ్డారు.
రైతులను నిలువరించేందుకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రైతులు కూడా కదం తొక్కుతుండడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందన్న దానిపై ఆందోళన నెలకొంది. అయితే, పరిస్థితిని అంచనా వేసిన రైతులు 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం విరమించుకున్నారు. కొందరు రైతులు గాయపడిన నేపథ్యంలో, ముందుకు వెళ్లకపోవడమే మంచిదని రైతు సంఘాల నేతలు నిర్ణయించుకున్నారు.