SVSN Varma: కాకినాడ ఎస్ఈజెడ్ పై చర్చకు రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
- కాకినాడ సెజ్ విషయంలో ఎస్వీఎస్ఎన్ వర్మ స్పందన
- వైసీపీ నేతలు రేపు మధ్యాహ్నం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ కు రావాలన్న వర్మ
- చర్చకు రాకపోతే రైతులకు అన్యాయం చేసింది మీరేనని ఒప్పుకున్నట్టవుతుందని వ్యాఖ్యలు
కాకినాడ ఎస్ఈజెడ్, పోర్టు అంశంపై దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
వైసీపీ నేతలు తన సవాల్ స్వీకరించాలని, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పాడ బస్టాండ్ సెంటర్ కు రావాలని స్పష్టం చేశారు. ఒకవేళ చర్చకు రాకపోతే... రైతులకు అన్యాయం చేసింది మీరేనని ఒప్పుకున్నట్టేనని వర్మ వ్యాఖ్యానించారు.
కాకినాడ ఎస్ఈజెడ్ ను ఎవరు ప్రారంభించారు... బినామీలు ఎవరు అనేదానిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. సెజ్ విషయంలో దాడిశెట్టి రాజా, కన్నబాబు, వంగా గీతలకు భయం పట్టుకుందని వర్మ ఎద్దేవా చేశారు.
ఎస్ఈజెడ్ తీసుకువచ్చింది ఎవరో వైసీపీ నేతలు మొదట తెలుసుకోవాలని హితవు పలికారు. రిజిస్ట్రేషన్ భూములకు రూ.160 కోట్లు చెల్లించిన ఘనత చంద్రబాబుది అని వర్మ వెల్లడించారు.