Vasireddy Padma: జగన్ ప్రజలు, కార్యకర్తల విశ్వాసాన్నికోల్పోయారు.. పార్టీ బాధ్యతలు విజయమ్మకు అప్పగించాలి: వాసిరెడ్డి పద్మ
- ఎంపీ కేశినేని చిన్నితో కలిసి విలేకరులతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ
- సీఎం చంద్రబాబును మార్చాలన్న విజయసాయి వ్యాఖ్యలపై మండిపాటు
- చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక
- జగన్ ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉందని ఆరోపణ
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆ పార్టీ మాజీ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు, పార్టీ విశ్వాసాన్ని జగన్ కోల్పోయారని, కాబట్టి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని పార్టీని తల్లి విజయమ్మకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎంపీ కేశినేని చిన్నితో కలిసి నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైనా మండిపడ్డారు.
చంద్రబాబును మార్చాలన్న విజయసాయి వ్యాఖ్యలకు పద్మ కౌంటర్ ఇస్తూ.. తొలుత వైసీపీ అధ్యక్షుడిని మార్చాలన్నారు. విజయసాయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉన్నట్టు అర్థమవుతోందని, ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
వీటిపై సమాధానం చెప్పలేక సీఎం పదవిని వివాదం చేయడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన పద్మ.. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించినప్పటికీ ముహూర్తాన్ని ఇంకా నిర్ణయించలేదు.