Dil Raju: రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత దిల్ రాజు
- జుబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిసిన దిల్ రాజు
- టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమితులైన దిల్ రాజు
- సీఎంకు కృతజ్ఞతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజును ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన దిల్ రాజు... తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తన సోదరుడు శిరీష్‌తో కలిసి దిల్ రాజు తెలంగాణ సీఎం నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి... దిల్ రాజుకు శాలువా కప్పి అభినందించారు.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 2003లో దిల్ సినిమాకు దిల్ రాజు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.