Nara Lokesh: అప్పటికే మా నాన్న రాష్ట్రం మొత్తానికి టీచర్: బాపట్లలో నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- బాపట్లలో మెగా పేరెంట్-టీచర్ సమావేశం
- హాజరైన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుందన్న లోకేశ్
మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ లో భాగంగా బాపట్ల మున్సిపల్ హైస్కూలులో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తన చిన్ననాటి సంగతులు పంచుకున్నారు.
"మిమ్మల్ని చూసిన తరువాత నాకు నా స్కూల్ డేస్ గుర్తు వచ్చాయి. చిన్నప్పుడు మా స్కూల్ లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరిగితే మా అమ్మ వచ్చేవారు. మా నాన్న అప్పటికే రాష్ట్రానికి టీచర్ కాబట్టి నా స్కూల్ కి రావడానికి ఆయనకి టైం ఉండేది కాదు. పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తాడు. పిల్లలంతా నా కొడుకు దేవాన్ష్ లాగే అనిపిస్తారు. మా వాడు హైదరాబాద్ నేను అమరావతి. వాడితో ఆడుకోవడం కూడా కుదరడం లేదు.
ఎంత ఒత్తిడిలో ఉన్నా... ఎన్ని పనులు ఉన్నా.... పిల్లలు కనిపిస్తే నేను ఆగిపోతాను. సరదాగా కాసేపు వాళ్లతో ఆడుకుంటాను. పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ మంత్రిని కావడం నా అదృష్టం. ఏ వృత్తి చేపట్టిన వారైనా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులంటే నాకు ఎంతో గౌరవం. జాతిపిత మహాత్మాగాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని మా ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజనరీ ఆలోచనలతో మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ తీసుకొస్తున్నాం.
ఆరు నెలల్లో డీఎస్సీ పూర్తి చేస్తాం!
అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం. ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఈ క్రమంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నాం.
సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుంది!
మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉంది. మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్య బంధం బలపడుతుంది. ఒక వ్యవస్థ బాగుపడాలంటే... అందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలి.
విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి అని సీఎం గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, సూచనలతో బడి భవిష్యత్తు కోసం చదివే పిల్లలు-వారి తల్లిదండ్రులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు-గైడ్ చేసే హెడ్మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీలు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఆ పనికిమాలిన యాప్స్ తొలగించాలని ఆదేశాలిచ్చాం
ఉపాధ్యాయులు చదువు మాత్రమే చెప్పాలి, మరుగుదొడ్లు, భోజనం ఫోటోలు తీయడం వారి బాధ్యత కాదు. దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్రంలో టీచర్లు చదువు మాత్రమే చెప్పాలి ఇతర పనులు, పనికిమాలిన యాప్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందిస్తున్నాం. పిల్లలను పిడుగులను తయారు చేసే బాధ్యత నాది. కేజీ టూ పీజీ కరిక్యులం మారుస్తున్నాం.
అందరినీ ఆకట్టుకున్న నారా లోకేశ్
బాపట్ల హైస్కూల్లో పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సీఎం, మంత్రి అయినప్పటికీ వారిద్దరూ ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నేలపై కూర్చుని భోజనం చేశారు. ఇక, భోజనం అయిపోయాక తన తండ్రి చంద్రబాబు తిన్న ప్లేట్ ను, తన ప్లేట్ ను నారా లోకేశ్ స్వయంగా తీసుకెళ్లి అవతల పెట్టడం అందరినీ ఆకట్టుకుంది.