Chandrababu: ఈ మెగా పేరెంట్-టీచర్ సమావేశం చరిత్ర తిరగరాసే ఆలోచన: సీఎం చంద్రబాబు

Chandrababu attends mega parent teacher meeting in Bapatla

  • ఏపీలో నేడు మెగా పేరెంట్-టీచర్ సమావేశం
  • బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో సమావేశానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు
  • ఈ సమావేశం గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుందన్న సీఎం
  • ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబరు 7న పేరెంట్-టీచర్ సమావేశం

బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్-టీచర్ సమావేశానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. హైస్కూల్ ప్రాంగణంలో వారు విద్యార్థులతో ముచ్చటించారు. చంద్రబాబు, లోకేశ్... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... ఎలక్ట్రానిక్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు చాలామంది తయారయ్యారని, మాయమాటలతో జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నాలజీ వల్ల మంచితో పాటు చెడు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోజులో 24 గంటలూ ఫోన్ చూడడం అనేది ఒక వ్యసనం అని, ఆ బలహీనత నుంచి బయటపడాలని పేర్కొన్నారు. పిల్లల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 

ఇక, డ్రగ్స్ వ్యసనానికి బానిస అయితే మళ్లీ మామూలు మనిషి కావడం కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయిని కూరగాయల్లా ఇళ్ల వద్దే పండించే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు వెల్లడించారు. కొత్తగా తీసుకుచ్చిన 'ఈగల్' వ్యవస్థ ద్వారా గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. 

ఇవాళ నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ సమావేశం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతుందని అన్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబరు 7న పేరెంట్-టీచర్ సమావేశం జరుగుతుందని, పేరెంట్-టీచర్ సమావేశం అనేది చరిత్ర తిరగరాసే ఆలోచన అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

"నేను నేర్చుకున్న విషయాలను సమాజ అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంటా. ఎస్.పి.టి.పి అంటే... స్టూడెంట్-పేరెంట్-టీచర్-ప్రభుత్వం. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎస్.పి.టి.పి పనిచేస్తుంది. విద్యార్థులు పాఠశాలకు రాకపోతే వారి తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్ లు వెళతాయి. పిల్లల పరీక్షల ఫలితాలు, ఆరోగ్య అంశాలు కూడా మెసేజ్ ల రూపంలో పంపించడం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే. 

2047 నాటికి ఏపీ ఎలా ఉండాలో విజన్ రూపొందించాం. ప్రైవేటు విద్యాసంస్థల కంటే ఉత్తమంగా ప్రభుత్వ స్కూళ్లను తయారుచేస్తాం" అని సీఎం చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News