Pawan Kalyan: వాళ్లే నిజమైన హీరోలు... వారిని గౌరవించండి: కడపలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
- ఏపీలో నేడు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్
- కడప కార్పొరేషన్ హైస్కూల్లో సమావేశానికి హాజరైన పవన్
- విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వినూత్న రీతిలో తీసుకువచ్చిన కార్యక్రమం మెగా పేరెంట్-టీచర్ మీటింగ్. రాష్ట్రంలో ఉన్న దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో నేడు ఈ పేరెంట్-టీచర్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన సమావేశానికి హాజరు కాగా... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడపలోని కార్పొరేషన్ హైస్కూల్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.
పవన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఓ తరగతి గదిలో విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. వారు ఎలా చదువుతున్నారు, పాఠ్యాంశాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేరెంట్-టీచర్ మీటింగ్ లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పేరెంట్-టీచర్ మీటింగ్ కోసం తాను కడపను ఎంచుకోవడానికి కారణం ఉందని, ఇది ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కడప చదువుల గడ్డ అని అభివర్ణించారు.
సింహం గడ్డం గీసుకుంటుంది నేను గీసుకోను అని డైలాగులు చెబితే వెనుక రీరికార్డింగులు వస్తాయని, హీరో నడిచినా దానికి రీరికార్డింగ్ ఉంటుందని... కానీ కార్గిల్ లో చనిపోయినవారికి, టీచర్లకు రీరికార్డింగులు ఉండవని అన్నారు. కానీ సైనికులు, టీచర్లే నిజమైన హీరోలు అని, వాళ్లను గౌరవించాలని పిలుపునిచ్చారు. మనం హీరోలను చూసుకోవాల్సింది సినిమాల్లో నటించే వారిలో కాదు.... మీ టీచర్లలో హీరోలను చూసుకోండి అని విద్యార్థులకు సూచించారు.
టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని... ఇది ఎంతవరకు సాధ్యమో తెలియదుకానీ, ఆ దిశగా తాను ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. టీచర్లకు కూడా పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అవసరం అని, తరగతి గదుల్లో పాఠాలు చెప్పడం ద్వారా వారు అలసిపోతుంటారని పవన్ కల్యాణ్ వివరించారు.
ఇక, పిల్లలు సోషల్ మీడియా తక్కువగా వాడేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్ ను చదువు కోసం, అభివృద్ధి చెందడం కోసం వాడుతున్నారా, లేక చెడు మార్గాల వైపు వెళ్లేందుకు వాడుతున్నారా అనేది గమనిస్తుండాలని సూచించారు.
విద్యార్థులు, పాఠశాలల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, నిధులు తక్కువే అయినా సమస్యల పరిష్కారానికి దారులు వెదుకుతామని చెప్పారు. ఎవరైనా పాఠశాలల స్థలాలను ఆక్రమిస్తే గూండా యాక్ట్ కింద కేసులు పెట్టడం జరుగుతుందని పవన్ హెచ్చరించారు.