Devendra Fadnavis: ఇందిరాగాంధీ పేరుందని స్కూలు మారాడట.. మహా సీఎం ఫడ్నవీస్ చిన్ననాటి సంఘటన
- ఎమర్జెన్సీ కాలంలో ఫడ్నవీస్ తండ్రి అరెస్టు
- ఇందిర కాన్వెంట్ హైస్కూల్ కు వెళ్లనంటూ ఫడ్నవీస్ మొండిపట్టు
- టీసీ తీసుకుని సరస్వతీ విద్యాలయంలో చేర్పించిన తల్లిదండ్రులు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాల్యంలోనే ఫడ్నవీస్ నిరసన వ్యక్తం చేయడంపై ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ జైలుపాలయ్యారు. దీంతో అప్పటి వరకు తాను చదువుతున్న ఇందిరా కాన్వెంట్ హైస్కూలుకు ఇక వెళ్లేది లేదంటూ ఫడ్నవీస్ భీష్మించారు. ఇందిర పేరుందని ఆ కాన్వెంట్ కు వెళ్లనని తేల్చిచెప్పాడట.
దీంతో ఆయన తల్లిదండ్రులు కాన్వెంట్ నుంచి టీసీ తీసుకుని దేవేంద్ర ఫడ్నవీస్ ను సరస్వతీ విద్యాలయ పాఠశాలలో చేర్పించారట. స్కూలుకు వెళ్లే వయసులోనే ఫడ్నవీస్ ఆలోచనలు, నిరసన వ్యక్తంచేసిన తీరును ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. చిన్నతనంలోనే తమ నేత రాజకీయ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్.. మున్సిపల్ కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ప్రస్తుతం మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.