Death Penalty: బాలికపై అత్యాచారం, హత్య చేసిన యువకుడికి ఉరి.. రెండు నెలల్లోనే తీర్పు చెప్పిన బెంగాల్ కోర్టు
- దారుణం జరిగిన గంటల వ్యవధిలోనే అరెస్టు
- నెలలో పూర్తయిన కోర్టు ట్రయల్
- పోలీసులకు సీఎం మమతా బెనర్జీ ప్రశంసలు
పశ్చిమ బెంగాల్ లో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడో పందొమ్మిదేళ్ల యువకుడు.. ఈ దారుణం జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టంలోని 103 (హత్య), 65 (అత్యాచారం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వేగంగా దర్యాఫ్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. నెల రోజుల్లోపే ట్రయల్ పూర్తి కాగా రెండు నెలల్లో స్పెషల్ కోర్టు విచారణ పూర్తిచేసి నిందితుడికి ఉరి శిక్ష విధించింది. రాష్ట్ర చరిత్రలోనే వేగంగా విచారణ జరిపి మరణశిక్ష విధించడం ఇదే ప్రథమమని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు చేసిన కృషి అభినందనీయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెచ్చుకున్నారు.
కేసు ఏంటంటే..
దక్షిణ 24 పరగణాల జిల్లాలో ట్యూషన్ కు వెళ్లిన పదేళ్ల బాలిక ఇంటికి తిరిగిరాలేదు. రాత్రయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్యూషన్ నుంచి ఇంటికి బయలుదేరిన బాలికను ఓ యువకుడు తీసుకెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఫుటేజీ ఆధారంగా గంటల వ్యవధిలోనే మోస్టాకిన్ సర్దార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
విచారణలో ఆ యువకుడు నేరం అంగీకరించాడు. ఐస్ క్రీం ఇప్పిస్తానంటూ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించాడు. మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని చూపించాడు. బాలిక మరణంతో మాహిషమారి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు ఆగ్రహంతో స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలో బాలిక డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన వైద్యులు.. బాలికపై అత్యాచారం జరిగిందని తేల్చారు. దీంతో సర్దార్ పై రేప్, మర్డర్ కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వేగంగా విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. నిందితుడిని దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది.