Virat Kohli: అడిలైడ్ టెస్టు.. నోటికి పని చెప్పిన కోహ్లీ.. ఇదిగో వీడియో!
- అడిలైడ్ ఓవల్ వేదికగా భారత్, ఆసీస్ రెండో టెస్టు
- ఆసీస్ ఓపెనర్ మెక్‌స్వీనీపై కోహ్లీ స్లెడ్జింగ్
- తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌటైన టీమిండియా
- 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నోటికి పని చెప్పాడు. ఆసీస్ ఓపెనర్ మెక్‌స్వీనీని దారుణంగా స్లెడ్జ్ చేశాడు. మొదటి రోజు ఆఖరి సెషన్‌లో మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా కోహ్లీ యువ బ్యాటర్‌పై స్లెడ్జింగ్‌కి పాల్పడ్డాడు. స్టంప్ మైక్‌లో కోహ్లీ మాటలు రికార్డు అయ్యాయి.
అసలేం జరిగిందంటే..
భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మెక్‌స్వీనీ బంతిని ఎదుర్కొవడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. త్రుటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అంతే.. విరాట్ అతనిపై స్లెడ్జింగ్‌కు దిగాడు. జాస్.. అతనికి బంతిపై ఎలాంటి క్లూ లేదు. కానివ్వు అంటూ మెక్‌స్వీనీపై నోరుపారేసుకున్నాడు. కోహ్లీ స్లెడ్జ్ చేసిన మాటలు స్టంప్ మైక్‌లలో రికార్డు కావడం జరిగింది. దీని తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ పింక్ బాల్ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే కేఎల్ రాహుల్ 37, గిల్ 31, రిషభ్ పంత్ 21 రన్స్ చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లతో భారత ఇన్నింగ్స్‌ను శాసించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది. మెక్‌స్వీనీ (38), లబుషేన్ (20) క్రీజులో ఉన్నారు.