Mayawati: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కుమార్తెతో తన కుమారుడి పెళ్లి జరిపించిన బీఎస్పీ సీనియర్ నేతకు షాక్!

BSP Chief Mayawati Expels Senior Leader For Arranging Sons Marriage To SP MLAs Daughter

  • పార్టీ నుంచి బహిష్కరించిన అధినేత్రి మాయావతి
  • తన వ్యతిరేక వర్గ పార్టీ నేతతో వియ్యం అందుకోవడంపై ఆగ్రహం
  • పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ వేటు

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే త్రిభువన్ దత్తా కుమార్తెతో తన కుమారుడి వివాహం జరిపించిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నేత సురేంద్రసాగర్‌ను ఆ పార్టీ అధినేత్రి మాయావతి పార్టీ నుంచి బహిష్కరించడం సంచలనమైంది. మాయవతి సారథ్యంలోని బీఎస్పీలో ఒకప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన త్రిభువన్ దత్తా కుమార్తెతో బీఎస్పీ సీనియర్ నేత అయిన సురేంద్రసాగర్ తన కుమారుడు అంకుర్ వివాహం జరిపించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అయిన మాయవతికి ఇది కోపం తెప్పించింది. తన వ్యతిరేక వర్గానికి చెందిన పార్టీ నేతతో వియ్యం అందుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. సాగర్‌ను రాంపూర్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

బరేలీ డివిజన్‌కు చెందిన సురేంద్రసాగర్ గతంలో కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు. పార్టీలో కీలక పదవులు నిర్వర్తించారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. అయితే, ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ నేతతో సంబంధం కలుపుకోవడం, వివాహానికి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరు కావడంతో ఆగ్రహించిన మాయావతి పార్టీ నుంచి సురేంద్రసాగర్‌ను బహిష్కరించారు. అయితే, తానేమీ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడలేదని, తన కుమారుడికి పెళ్లి మాత్రమే జరిపించానని సాగర్ వివరణ ఇచ్చారు.  

  • Loading...

More Telugu News