Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలోకి వెళ్లిపోయిన కుటుంబం.. రాతంత్రా భయంభయంగా కారులోనే!
- బీహార్ నుంచి గోవాకు బయలుదేరిన కుటుంబం
- కర్ణాటకలోని భీమ్‌గఢ్ వైల్డ్‌లైఫ్ జోన్‌లో 7 కిలోమీటర్ల లోపలికి
- మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయిన వైనం
- క్రూరమృగాల భయంతో కారు లాక్ చేసుకుని రాతంత్రా అందులోనే
- తెల్లవారాక వెనక్కి వచ్చి పోలీసులకు సమాచారం
- గ్రామస్థుల సాయంతో రక్షించిన పోలీసులు
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. చివరికి పోలీసుల సాయంతో బయటపడి ఊపిరి పీల్చుకుంది. బీహార్‌కు చెందిన రాజ్‌దాస్ రంజిత్‌దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరింది. ఈ కుటుంబంలో చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు.
గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్ దాటిన తర్వాత షిరోడగ, హెమ్మగూడ గ్రామాల మధ్య గుండా గూగుల్ మ్యాప్స్ దారి చూపించింది. దానిని అనుసరించి వెళ్లిన వారు భీమ్‌గఢ్ వైల్డ్ లైఫ్ జోన్‌లో ఏడు కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో ఎవరినీ సాయం అర్థించే అవకాశం లేకుండా పోయింది. అక్కడి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో అటవీ జంతువుల బారినపడకుండా కారును లాక్ చేసుకుని రాతంత్రా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.
తెల్లవారాక వెళ్లిన దారిలోనే వెనక్కి మూడు కిలోమీటర్లు రావడంతో మొబైల్ నెట్‌వర్క్ వచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబం వెంటనే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పరిస్థితి చెప్పింది. వెంటనే స్పందించిన బెలగావి పోలీస్ కంట్రోల్ రూం ఖానాపూర్ పోలీసులకు సమాచారం చేరవేసింది. వారు గ్రామస్థులు, జీపీఎస్ సాయంతో కుటుంబాన్ని గుర్తించి రక్షించారు.
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని ఇలా అవస్థలు పాలు కావడం ఇదే తొలిసారి కాదు. నవంబర్ 24న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ముగ్గురు కారులో వెళ్తూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్‌పై నుంచి వెళ్తూ రామ్‌గంగా నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో కారు ఓ కాల్వలోకి దూసుకెళ్లింది.