Elon Musk: ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మ‌స్క్ ఎంత‌ ఖ‌ర్చు చేశాడో తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

Elon Musk Spent 270 Million Dollars To Help Donald Trump Win US Presidency

  • ట్రంప్ విజ‌యం కోసం రూ.2వేల కోట్లు వెచ్చించిన మ‌స్క్‌
  • గతంలో రిపబ్లికన్ అగ్ర దాత టిమ్ మెల్లన్ 200 మిలియన్ డాల‌ర్లు ఇచ్చార‌న్న వాషింగ్టన్ పోస్ట్
  • ఇప్పుడు ఆయ‌న్ను వెన‌క్కి నెట్టి దేశ‌ అతిపెద్ద రాజకీయ దాతగా మారిన మ‌స్క్‌

ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆయ‌న అగ్ర‌రాజ్యం కొత్త అధ్యకుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. అయితే, ట్రంప్ విజ‌యంలో టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మ‌స్క్ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. 

ఆయ‌న గెలుపు కోసం ఈ ప్ర‌పంచ కుబేరుడు భారీగానే వెచ్చించిన‌ట్లు తాజాగా ఫెడ‌ర‌ల్ ఫైలింగ్ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ట్రంప్ విజ‌యం కోసం మ‌స్క్ ఏకంగా 270 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు పేర్కొంది. అంటే భార‌తీయ క‌రెన్సీలో సుమారు రూ.2వేల కోట్లు అన్న‌మాట‌. 

గతంలో దాదాపు 200 మిలియన్ డాల‌ర్లు ఇచ్చిన ట్రంప్ మద్దతుదారు టిమ్ మెల్లన్ కంటే మస్క్ ఈ ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేశారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. 

ఇక ట్రంప్ త‌ర‌ఫున ఈసారి పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ (పీఏసీ) ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. పీఏసీకి మస్క్ 238 మిలియన్ డాల‌ర్ల‌ను విరాళంగా ఇచ్చారు. అదనంగా 20 మిలియన్ డాల‌ర్లు ఆర్‌బీజీ పీఏసీకి వెళ్లాయి. 

అలాగే ఇత‌ర రూపాల్లో మ‌రికొంత ఇవ్వ‌డం జ‌రిగింది. ఇలా మ‌స్క్ మొత్తంగా 270 మిలియ‌న్ డాల‌ర్లు వెచ్చించారు. అలాగే ట్రంప్ ప్ర‌చార ర్యాలీల‌లోనూ మ‌స్క్ పాల్గొని మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో పాటు సోలో క్యాంపెయిన్‌లు కూడా నిర్వ‌హించారు. 

ఇక తాను అధ్య‌క్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మ‌స్క్ కు త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తాన‌న్న ట్రంప్‌.. త‌న మాట నిల‌బెట్టుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ‌వ‌ర్న‌మెంట్ ఎఫీషియెన్సీ (డోజ్‌) బాధ్య‌త‌ల‌ను మ‌స్క్‌కు అప్ప‌గించారు. అమెరికా ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులే డోజ్ ప్రాజెక్టు ల‌క్ష్య‌మ‌ని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇలా త‌న ప్ర‌భుత్వంలో మ‌స్క్‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 

  • Loading...

More Telugu News