Devendra Fadnavis: వారి పార్టీ నుంచి సీఎం ఉండాలని ఏక్‌నాథ్ షిండే పార్టీ నాయకులు కోరుకున్నారు!: దేవేంద్ర ఫడ్నవీస్
- ఏక్‌నాథ్ షిండేతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్న ఫడ్నవీస్
- బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఉండేందుకు షిండే ముందే అంగీకరించారన్న సీఎం
- తాను భేటీ అయినప్పుడే డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఓకే చెప్పారని వెల్లడి
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావాలని శివసేన నాయకులు కోరుకున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఆ పార్టీ అధినేత ఏక్‌నాథ్ షిండేతో వ్యక్తిగతంగా తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. నిన్న మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవేంద్ర ఫడ్నవీస్ పలు విషయాలను వెల్లడించారు.
ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం అనంతరం జరిగిన తొలి సమావేశంలోనే బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఉండేందుకు షిండే అంగీకరించినట్లు చెప్పారు. అయితే షిండే ప్రభుత్వంలో భాగం కాకూడదని భావించారన్నారు. కానీ మహాయుతి కూటమి ప్రభుత్వం సజావుగా సాగేందుకు షిండే నాయకత్వం వహిస్తే చాలని కొంతమంది భావించినట్లు చెప్పారు. అదే సమయంలో ఆ పార్టీలో కొంతమంది షిండే సీఎంగా కావాలని కోరుకున్నారన్నారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు రోజుల ముందే తాను షిండేతో భేటీ అయ్యానన్నారు. అప్పుడే ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా, గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.