Rajya Sabha: రాజ్యసభలో నోట్లు కలకలం.. కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద లభ్యం

Cash was recovered by Parliament security officials from the seat allotted to Congress MP Abhishek Manu Singhvi

  • సాధారణ తనిఖీలో నోట్లు దొరికాయని రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటన
  • కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద ఉన్నాయని వెల్లడి
  • విచారణకు ఆదేశించినట్టు ప్రకటన
  • దర్యాప్తు చేయకుండానే పేరు ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం
  • సభకు వచ్చేటప్పుడు ఒక రూ.500 నోటు తెచ్చుకుంటానన్న సింఘ్వీ
  • నిన్న సభ నుంచి క్యాంటీన్‌కు.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయానని క్లారిటీ
  • దర్యాప్తు చేపట్టకుండానే పేరు ప్రకటించడంపై అభ్యంతరం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 9వ రోజైన శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు 11 గంటలకు మొదలయ్యాయి. రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాక చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటులో నగదు గుర్తించామని వెల్లడించారు. కరెన్సీ నోట్లు దొరికాయని తెలిపారు. పార్లమెంట్ భద్రతా అధికారులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిన్న సభ వాయిదా పడిన తర్వాత సాధారణ తనిఖీ చేస్తున్న సమయంలో నగదు పట్టుబడిందని, ప్రస్తుతం అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి కరెన్సీ నోట్లను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో విచారణ జరుగుతుందని, ఈ మేరకు ఆదేశించానని ధన్‌ఖడ్ చెప్పారు.

ధన్‌ఖడ్ చేసిన ఈ ప్రకటనపై విపక్ష కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. నిరసనలకు దిగారు. విచారణ జరపకుండానే ఇలా పేరు ప్రకటించడం ఏమిటిని ప్రశ్నించారు. సభా చైర్మన్ స్థానంలో కూర్చొని ఈ విధంగా ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

సభకు ఒక రూ.500 నోటు తెచ్చుకుంటా: అభిషేక్ సింఘ్వీ
తనకు కేటాయించిన సీటు వద్ద నగదు లభ్యమైందంటూ రాజ్యసభ చైర్మన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. రాజ్యసభకు వెళ్లేటప్పుడు ఒక రూ.500 నోటు తీసుకెళ్తుంటానని ఆయన చెప్పారు. ‘‘ నిన్న (గురువారం) మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో నేను పార్లమెంట్‌కు చేరుకున్నాను. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సభలో ఆందోళన జరుగుతోంది. ఆ సమయంలో నేను క్యాంటీన్‌కు వెళ్లి 1.30 గంటల వరకు అక్కడే ఉన్నాను. అయోధ్య ప్రసాద్‌తో కలిసి క్యాంటీన్‌లో ఉన్నాను. ఆ తర్వాత పార్లమెంట్ నుంచి వెళ్లిపోయాను. కానీ మీరు నా పేరు ప్రస్తావించారు’’ అని అభిషేక్ మను సింఘ్వీ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కాగా ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.


  • Loading...

More Telugu News