Health: ఈ ఫుడ్స్‌ ను చీకట్లోనే ఉంచాలట.. ఎందుకో తెలుసా?

always store these foods in the dark

  • కొన్ని రకాల సరుకులు, పదార్థాలను ఇళ్లలో నిల్వ చేసుకోవడం మామూలే
  • వాటిని కిచెన్ లో ఏదో ఒక చోటపెడుతూ ఉండటమూ సాధారణమే...
  • కొన్నిరకాల ఆహార పదార్థాలకు నేరుగా ఎండ, ఎక్కువ వెలుతురు తగిలితే సమస్యలకు కారణమవుతాయని చెబుతున్న నిపుణులు

నాలుగైదు రోజులకోసారో, వారానికి ఒకసారో ఇంటికి సరుకులు తెచ్చుకుంటాం. అందులో కూరగాయలు, ఇతర సామగ్రి వంటివి అయితే ఫ్రిడ్జ్ లోనో, లేదా కిచెన్ లో ఏదో ఓ పక్కనో పెడుతుంటాం. ఇంత వరకు బాగానే ఉంది. కానీ కొన్ని రకాల సరుకులు, ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో కన్నా బయట స్టోర్ చేస్తేనే బాగుంటాయి. అందులోనూ వెలుతురు ఎక్కువగా పడని చోట నిల్వ చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చేదుగా మారే ఉల్లి, వెల్లుల్లి...
ఉల్లిపాయలకు ఎక్కువ వెలుతురు, ఎండ తగిలేలా పెడితే... అవి మొలకెత్తడం మొదలుపెడతాయని, చేదుగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిని కూరల్లో వాడినప్పుడు కూరల రుచి దెబ్బతింటుందని వివరిస్తున్నారు. వెలుతురు లేని చోట పెట్టినా... వాటికి గాలి బాగా తగిలేలా ఉండాలని, లేకుంటే ఫంగస్ పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇదే తరహాలో వెల్లుల్లిని కూడా వెలుతురు పెద్దగా లేని, గాలి బాగా ఆడే చోట నిల్వ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే వెల్లుల్లి రుచి, వాసన తగ్గిపోతాయని చెబుతున్నారు.

బంగాళ దుంపల్లో విష పదార్థం!
ఇదే తరహాలో బంగాళదుంపలను కూడా ఎండ, ఎక్కువ వెలుతురు తగలని చోట నిల్వ చేయాలి. లేకుంటే బంగాళ దుంపలు మొలకెత్తుతాయని... ఆ సమయంలో వాటిలో విడుదలయ్యే సోలనైన్ అనే విష పదార్థం వల్ల మనం అనారోగ్యాల పాలు కావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నిస్సారమయ్యే మసాలాలు...
మసాలాలను బాగా వెలుతురు తగిలేలా ఉంచితే క్రమంగా నిస్సారం అవుతాయని... వాటిలోని సుగంధ వాసన, రుచి తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే... స్టీలు డబ్బాల వంటి వాటిలో నిల్వ చేసుకోవడం వల్ల లాభం ఉంటుందని వివరిస్తున్నారు.

ఆలివ్ ఆయిల్...
నేరుగా ఎండ పడేచోటగానీ, వెలుతురు తీవ్రంగా రిఫ్లెక్ట్ అయ్యే చోటగానీ ఆలివ్ ఆయిల్ ను నిల్వ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆలివ్ ఆయిల్ లో రసాయన మార్పులు జరిగి, దాని సువాసన, రుచి తగ్గిపోతాయని స్పష్టం చేస్తున్నారు.

రుచి మారిపోయే చాకోలెట్...
డార్క్ చాకోలెట్ గానీ, మిల్క్ చాకోలెట్ గానీ ఏదైనా సరే నేరుగా ఎండ, ఎక్కువ వెలుతురు తగిలేలా ఉంచవద్దని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల చాకోలెట్లు కరగడం, రుచి చేదుగా మారడం వంటి మార్పులు వస్తాయని వివరిస్తున్నారు.

త్వరగా చెడిపోయే డ్రై ఫ్రూట్స్...
బాదాం, కాజు, వేరుశనగ ఇతర డ్రైఫ్రూట్స్ కు ఎక్కువగా వెలుతురు తగిలితే... వాటిలోని నూనె పదార్థాలు బయటికి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాలపై ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంటుందని... రుచి, వాసన చెడిపోతాయని స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News