Devendra Fadnavis: అలాంటి షాక్‌లు ఇక ముందు ఉండవు: మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
- 2019 నుంచి 2022 మధ్య సవాళ్లు చూశామన్న ఫడ్నవీస్
- ప్రభుత్వంలో అలాంటి షాక్‌లు భవిష్యత్తులో ఉండవని ధీమా
- ప్రమాణానికి ముందు షిండే ప్రసంగం... అడ్డుకున్న గవర్నర్
ఇది వరకు చూసిన షాక్‌లు ఇక ముందు చూడబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. 2019 నుంచి 2022 వరకు ఎన్నో సవాళ్లను చూశామన్నారు.
శివసేన (పార్టీ ఒక్కటిగా ఉన్నప్పుడు)తో కలిసి పోటీ చేసిన బీజేపీ నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత శివసేన (ఉద్దవ్ ఠాక్రే)తో వచ్చిన విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఉద్దవ్ ఠాక్రే సీఎం అయ్యారు. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో బీజేపీ కలిసింది. దీంతో షిండే మిగిలిన పూర్తి కాలం సీఎంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో 2019 నుంచి 2022 మధ్య వరకు జరిగిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అలాంటి షాక్‌లు ఏమీ ఉండవని ధీమా వ్యక్తం చేశారు. మహాయుతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తమను మరోసారి గెలిపించాయన్నారు.
షిండే ప్రసంగాన్ని అడ్డుకున్న గవర్నర్
ఈరోజు సాయంత్రం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏక్‌నాథ్ షిండే స్క్రిప్ట్ చదవడానికి ముందు సొంత ప్రసంగాన్ని ప్రారంభించారు.
"ఈ సందర్భంగా నా గురువు ధర్మవీర్ ఆనంద్ దిఘేని స్మరించుకుంటున్నాను... హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేకు నా ప్రణామాలు. ప్రధాని మోదీ బలమైన నాయకత్వం, హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో, మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ఓటర్ల మద్దతుతో..." అంటూ షిండే మాట్లాడసాగారు. దీంతో వేదికపై ఉన్న వారు కాస్త అయోమయానికి గురయ్యారు. అదే సమయంలో గవర్నర్ ఆయన మాటలను అడ్డుకున్నారు. తిరిగి ప్రమాణ స్వీకార ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత షిండే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.