Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి రూ.5,942 కోట్ల నిధులు విడుదల

Government releases rs 6000 crores for fly overs in Hyderabad

  • హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే రోడ్ల అభివృద్ధికి నిధులు
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్
  • వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఉత్తర్వులు

హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చింది. ఈ మేరకు రూ.5,942 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని హెచ్-సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులో భాగంగా చేపట్టే రోడ్ల విస్తరణకు ఖర్చు చేయనున్నారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇటీవల హెచ్-సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా, ప్రభుత్వం జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో 5 ప్యాకేజీల్లో చేపట్టనున్న పనులకు నిధులను మంజూరు చేసింది. సికింద్రాబాద్ జోన్‌లోని ఏవోసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణ కోసం అత్యధికంగా రూ.940 కోట్లు విడుదల చేసింది.

ఖాజాగూడ, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి రూ.887 కోట్లు, మియాపూర్ క్రాస్ రోడ్డు నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్డు వరకు 6 లేన్ ఫ్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు 3 లేన్ అండర్ పాస్ నిర్మాణానికి రూ.530 కోట్లను విడుదల చేసింది. 

టీకేఆర్ కాలేజీ జంక్షన్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు సిక్స్ లేన్ ఫ్లైఓవర్ కోసం రూ.416 కోట్లు, రైతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.398 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News