China: ఆ చిప్ లు కొనుగోలు చేయొద్దంటున్న చైనా
- చైనా, అమెరికా మధ్య ఆధిపత్య పోరు
- చైనా కంపెనీలకు పారిశ్రామిక సంఘాలు, సమాఖ్యల సూచన
- ఎన్ విడియా, ఇంటెల్, ఏఎండీ చిప్ లు కొనుగోలు చేయొద్దని సలహా
వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు... ఇలా అనేక అంశాల్లో అమెరికా, చైనా మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు జరుగుతోంది. ప్రభుత్వాల మధ్య స్పర్ధల కారణంగా కంపెనీలు ఇబ్బంది పడుతుండడం తెలిసిందే.
తాజాగా, చైనాకు చెందిన నాలుగు పారిశ్రామిక సమాఖ్యలు, సంఘాలు తమ దేశ కంపెనీలకు కీలక సూచనలు చేశాయి. ఎన్ విడియా, ఇంటెల్, ఏఎండీ వంటి అమెరికా సంస్థలు రూపొందించిన చిప్ లను వాడొద్దని సలహా ఇచ్చాయి. అమెరికా కంపెనీలు తయారు చేసిన చిప్ లను కొనుగోలు చేసేముందు వాటి విశ్వసనీయత, భద్రత గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దేశీయ కంపెనీలకు స్పష్టం చేశాయి.
అమెరికా కంపెనీల నుంచి కొనుగోలు చేసే బదులు, వాటికి ప్రత్యామ్నాయంగా దేశీయంగా పలు పరిశ్రమలు రూపొందించే చిప్ లను వినియోగించాలని పారిశ్రామిక సంఘాలు సూచించాయి.
ఎగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఎన్ విడియా, ఇంటెల్, ఏఎండీ వంటి సంస్థలు చైనాలో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. ఇప్పుడు చైనా పారిశ్రామిక సంఘాలు, సమాఖ్యలే నేరుగా సూచనలు చేసిన నేపథ్యంలో, ఆయా అమెరికన్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారనుంది.