Pushpa2: సంధ్య థియేటర్ ఘటనపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందన
- హైదరాబాదులో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట
- రేవతి అనే మహిళ మృతి... ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు
- ఆ బాలుడు క్షేమంగా బయటపడాలన్న మైత్రీ మూవీ మేకర్స్
- బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియటర్ వద్ద తొక్కిసలాట జరగడం... రేవతి అనే మహిళ మృతి చెందడం తెలిసిందే. రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఇది ఎంతో విషాదకర ఘటన అని, దీని పట్ల తాము చాలా బాధపడుతున్నామని వెల్లడించింది. చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది.