Vangalapudi Anitha: ఎన్‌వోసీల జారీపై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్
- అగ్నిమాపక శాఖ యథేచ్ఛగా నిరభ్యంతర పత్రాల (ఎన్‌వోసీ)జారీ
- ఎన్‌వోసీల జారీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదన్న హోంమంత్రి
- అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి అనిత హెచ్చరికలు
ఏపీలో నేషనల్ బిల్డింగ్ కోడ్ మార్గదర్శకాలు, భద్రత ప్రమాణాలు పాటించని భవనాలకు అగ్నిమాపక శాఖ అధికారులు యథేచ్చగా నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) జారీ చేస్తున్నారు. సరైన తనిఖీలు లేకుండా దాదాపు 2,500లకుపైగా భవనాలకు ఎన్‌వోసీలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అధికారుల తీరుపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక, జైళ్లు, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల తీరు మార్చుకోవాలని సూచించారు. ఎన్‌వోసీల జారీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. త్వరలో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అప్పటిలోగా అధికారుల పరిస్థితి మారకపోతే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
ఇదే క్రమంలో బాధిత పోలీసు కుటుంబాలకు తీపి కబురు చెప్పారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని ప్రభుత్వం లక్షకు పెంచినట్లు మంత్రి అనిత వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.25 వేల సాయాన్ని లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.