Nadendla Manohar: నిజాయతీగా మాటకు కట్టుబడి ప్రభుత్వం పని చేస్తోంది: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar review on paddy procurement centre

  • ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.2,283 కోట్లు చెల్లించినట్లు వివరణ 
  • గత ప్రభుత్వం ఖజానాపై రూ.11 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపిందన్న మంత్రి
  • రైతులు తమకు నచ్చిన మిల్లుకే ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించామని వెల్లడి

సమర్థవంతంగా, నిజాయతీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం ఆయన అవనిగడ్డలో రెవెన్యూ సమావేశ మందిరంలో నియోజవర్గస్థాయి ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే తొమ్మిది లక్షల 91 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.2,283 కోట్లు నగదు చెల్లించినట్లు చెప్పారు. ఇందులో రూ.2,067 కోట్ల సొమ్మును ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోనే చెల్లించినట్లు తెలిపారు.

తుపాను నేపథ్యంలో 40 రోజులపాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం మూడు రోజుల్లో హడావిడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎదురైన సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై రూ.11 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపి వెళ్లిందన్నారు. రైతులకు రూ.1,674 కోట్ల బకాయిలు మిగిల్చి వెళ్లినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే రైతుల ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించామన్నారు.

రైతులు తమకు నచ్చిన మిల్లుకే ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించటంతో పాటు జీపీఎస్ నిబంధన కూడా తొలగించామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కొందరు మిల్లర్లు దళారులు కలసి ధర తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అరికట్టేందుకు కఠినమైన చర్యలు చేపడతామన్నారు. రైతులకు ఇబ్బంది కలిగించే మిల్లర్లపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో 25 శాతం తేమ ఉన్నా తక్షణమే ధాన్యం కొనేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రయ్యర్ల సౌకర్యం ఉన్న మిల్లులకు క్వింటాకు తొమ్మిది రూపాయలు ఎఫ్.సీ.ఐ ద్వారా నిధులు అందిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ సేవలు వినియోగించుకుని 73373 59375 నెంబరుకు రైతు హాయ్ అని పోస్ట్ చేస్తే అధికారులే రైతు వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఆ ధాన్యం కొనుగోలు చేయండి

రైతులు పండించిన 1262 రకం ధాన్యం మొత్తం మిల్లర్లు కొనాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది ప్రతిరోజు తప్పనిసరిగా 5 నుంచి 6 గంటలు క్షేత్రస్థాయిలో తిరిగి రైతులకు సహకరించాలని ఆదేశించారు. 

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, ఇరిగేషన్, డ్రైనేజీ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ధాన్యం సొమ్మును కూడా గత ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేదన్నారు. ఇప్పటికే అవనిగడ్డ నియోజకవర్గంలో 12,272 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1,441 మంది రైతులకు రూ.25 కోట్ల 89 లక్షల సొమ్ము చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.

  • Loading...

More Telugu News