Health: మందులతో పనిలేకుండా.. కిడ్నీలను సహజంగా క్లీన్ చేసేవి ఇవే!
- అధిక కొవ్వు ఉండే ఆహారం, జంక్ ఫుడ్ తో కిడ్నీలపై ఒత్తిడి
- మారిన జీవన శైలితో కిడ్నీ సమస్యలు బారినపడుతున్న జనం
- కొన్ని సహజ పద్ధతులను ఆచరిస్తే మూత్రపిండాలు శుభ్రమవుతాయని సూచిస్తున్న నిపుణులు
మన శరీరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను వడగట్టి బయటికి పంపేది మూత్రపిండాలే. అవి సరిగా పనిచేయకుంటే... ఎన్నో ఆరోగ్య సమస్యలు తప్పవు. మారిన జీవన శైలి, ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల మన శరీరంలో కిడ్నీలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీనితో కిడ్నీల పనితీరు దెబ్బతిని, అవి రక్తాన్ని శుభ్రం చేయడం కాదు, అవి కూడా వ్యర్థాలతో నిండిపోయి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సహజ పద్ధతులను ఆచరిస్తే మూత్రపిండాలు శుభ్రమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
నీళ్లు, నిమ్మ రసం...
మన శరీరంలో కిడ్నీలు సరిగా పనిచేయాలంటే... వ్యర్థాలు, విష పదార్థాలు బయటికిపోవాలంటే... తగినంత మేర నీళ్లు అందడం తప్పనిసరి. తగిన స్థాయిలో నీళ్లు తాగుతూ ఉంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే సమస్య కూడా తగ్గుతుంది.
- ఇక నిమ్మరసం సహజంగానే శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించేందుకు తోడ్పడుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
- అయితే అతిగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదని ... శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బయటికి వెళ్లిపోయి సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
క్రాన్ బెర్రీస్...
వీటిలో అధిక మోతాదులో ఉండే ప్రోఆంథోసైయనిడిన్స్ గా పిలిచే రసాయన సమ్మేళనం, యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలు ఇన్ఫెక‌్షన్ కు లోనుకాకుండా సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాక్టీరియా పెరగడాన్ని నిరోధించి... మూత్ర నాళ ఇన్ఫెక‌్షన్లను నివారిస్తాయని వివరిస్తున్నారు.
ఆకుకూరలు...
ఆకుకూరల్లో అధికంగా లభించే ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతాయి. ఇక ఆకుకూరల్లో ఎక్కువగా ఉండే మెగ్నీషియం... కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా, ఇన్ఫెక‌్షన్లు సోకకుండా అడ్డుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అల్లం, పసుపు...
అల్లం, పసుపులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు.. శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి కిడ్నీలకు రక్త సరఫరాను మెరుగుపర్చి, సహజంగా శుభ్రం అయ్యేలా తోడ్పడుతాయి. ముఖ్యంగా పసుపులోని కర్క్యుమిన్... కిడ్నీ వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తుంది.
యాపిల్స్...
యాపిల్ పండ్లలో ఉండే ‘పెక్టిన్’ ఫైబర్ కు... విష పదార్థాలను శోషించుకునే సామర్థ్యం ఉంటుంది. దీనివల్ల విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోయి కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది.
డండెలియన్ వేళ్లతో చేసిన టీ...
చామంతి జాతికి చెందిన డండెలియన్ మొక్కల వేళ్లతో చేసిన టీ... కిడ్నీలను శుభ్రపర్చడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందని, శరీరంలో ద్రవాల స్థాయులు సరిగా ఉండేలా చూస్తుందని వివరిస్తున్నారు.