Sukhbir Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకు మరుగుదొడ్లు కడిగే శిక్షని విధించిన అకల్ తఖ్త్
- పంజాబ్‌లో అకాలీ దళ్ అధికారంలో ఉన్నప్పుడు పలు తప్పిదాలకు పాల్పడినట్టు సుఖ్‌బీర్‌పై ఆరోపణలు
- తప్పులను బేషరతుగా అంగీకరించి క్షమాపణలు చెప్పిన సుఖ్‌బీర్
- నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి శిక్ష అమలు
- సుఖ్‌బీర్ తండ్రి, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఇచ్చిన ఫఖ్ర్-ఈ-క్వామ్ బిరుదు వెనక్కి
సిక్కు మతాన్ని అవమానించిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు అనుకూలంగా వ్యవహరించినందుకు పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సహా పలు గురుద్వారాల్లో బాత్రూములు కడగాలని, వంటగదిలో అంట్లు తోమాలంటూ సిక్కుల అత్యున్నత కమిటీ అకల్ తఖ్త్ ఆదేశించింది. అలాగే, సిక్కు సమాజానికి సేవలు అందించినందుకు గాను సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు 2011లో అందించిన ‘ఫఖ్ర్-ఈ-క్వామ్ గౌరవాన్ని వెనక్కి తీసుకుంది.
సుఖ్‌బీర్ తన తప్పులకు బేషరతు క్షమాపణలు చెప్పిన అనంతరం అకల్ తఖ్త్ ఈ శిక్ష విధించింది. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సహా కోర్ కమిటీ సభ్యులు, 2015లో నాటి ప్రభుత్వంలో సభ్యులుగా ఉన్న అకాలీ దళ్ నాయకులు నేటి (3న) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో బాత్రూంలను శుభ్రం చేస్తారు. అనంతరం స్నానాలు చేసి వంటశాలలో భోజనం వడ్డిస్తారు. ఆ తర్వాత శ్రీ సుఖ్‌మణివని పఠిస్తారు. పంజాబ్‌లో అకాలీ దళ్ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.