Donald Trump: బందీలను విడిచిపెట్టండి.. లేదంటే నరకం చూస్తారు.. హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక
- జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్
- ఆలోగా బందీలను విడుదల చేయాలని హుకుం
- లేదంటే చరిత్రలోనే ఇప్పటి వరకు చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
- హమాస్ చెరలో 35 మంది సైనికులు సహా 97 మంది ఇజ్రాయెలీ పౌరులు
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ గాజా ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి బందీలను విడిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య 14 నెలల క్రితం ప్రారంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతోంది. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించే ఒప్పందాన్ని చేయడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈ హెచ్చరికలు చేశారు.
‘‘నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే జనవరి 20కి ముందు బందీలను విడుదల చేయకుంటే మధ్య ప్రాచ్యంలో ఈ దురాగతాలకు పాల్పడిన బాధ్యులు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’ ద్వారా హమాస్‌ను పరోక్షంగా హెచ్చరించారు. బందీలను విడుదల చేయకుంటే చరిత్రలో ఇప్పటి వరకు చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి వెంటనే వారిని విడుదల చేయాలని సూచించారు.
అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగిన హమాస్ చెలరేగిపోయింది. ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 1,208 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే చనిపోయారు. 35 మంది సైనికులు సహా 97 మంది ఇంకా గాజాలోనే బందీలుగా ఉన్నారు. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరుపుతున్న పోరులో గాజాలో ఇప్పటివరకు 44,429 మంది మరణించినట్టు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.