IPS Officer: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. శిక్షణ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్ మృతి

Karnataka IPS Officer On His Way To Take Up First Posting Dies In Accident

  • ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జుగా మారిన కారు
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మరణించిన ఆఫీసర్
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్

ఎంతో ఇష్టంతో, కష్టపడి సాధించిన కొలువులో చేరేందుకు వెళుతున్న ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. శిక్షణ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్ అందుకోవాల్సిన సమయంలో విగతజీవిగా మార్చురీకి చేరాడు. కర్ణాటకలోని మైసూరు పోలీస్ అకాడమీ నుంచి హసన్ కు వెళుతుండగా కారు ప్రమాదానికి గురి కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐపీఎస్ ఆఫీసర్ హర్షవర్ధన్ కన్నుమూశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మధ్యప్రదేశ్ కు చెందిన హర్షవర్ధన్ (26) సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఎంచుకున్నారు. కర్ణాటక కేడర్ లో ఐపీఎస్ కు ఎన్నికైన హర్షవర్ధన్.. మైసూరులోని పోలీస్ అకాడమీలో ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకున్నాడు. తొలి పోస్టింగ్ హసన్ జిల్లాలో ఇవ్వడంతో ఆదివారం రాత్రి మైసూరు నుంచి హసన్ కు బయలుదేరాడు. సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. టైర్ పేలిపోవడంతో వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిని, ఆ పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుగా మారింది.

హర్షవర్ధన్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలాడు. కారు డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ.. ఏళ్ల తరబడి శ్రమించి, తీరా ఆ శ్రమకు ఫలితం అందుకోవాల్సిన సమయంలో హర్షవర్ధన్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంటూ హర్షవర్ధన్ కుటుంబానికి సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News