GST: నవంబరు మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు
- గతేడాది నవంబరు జీఎస్టీ వసూళ్లతో పోల్చితే 8.5 శాతం పెరుగుదల
- 2023 నవంబరులో 1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
- ఈ ఏడాది నవంబరులో దేశీయ లావాదేవీలతో అత్యధిక వసూళ్లు
నవంబరు నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం నేడు వెల్లడించింది. నవంబరు మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది నవంబరుతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో 8.5 శాతం పెరుగుదల నమోదైనట్టు వివరించింది. 2023 నవంబరులో రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.
ఈ ఏడాది నవంబరులో దేశీయ ఆర్థిక లావాదేవీల ద్వారానే అత్యధిక ఆదాయం లభించినట్టు కేంద్రం పేర్కొంది. నవంబరు జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.34,141 కోట్లు కాగా... రాష్ట్రాల జీఎస్టీ రూ.43,047 కోట్లు. అదే సమయంలో ఐజీఎస్టీ రూ.91,828 కోట్లు, సెస్ రూ.13,253 కోట్లు.
భారత్ లో జీఎస్టీ ప్రవేశపెట్టాక ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు అంటే ఈ ఏడాది ఏప్రిల్ లో వసూలైన జీఎస్టీ గురించే చెప్పాలి. 2024 ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ ఏడాది అక్టోబరులో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా.... ఇది రెండో అత్యుత్తమ జీఎస్టీ కలెక్షన్ గా ఉంది.