EVM Tampering: ఈవీఎంను హ్యాక్ చేయగలనన్న వ్యక్తి... ఈసీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు
- భారత్ లో ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు
- ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంలపై గగ్గోలు
- ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న ఓడిపోయిన పార్టీలు
భారత్ లో గత కొంతకాలంగా ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈవీఎం ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ పలువురు నేతలు బాహాటంగా ఆక్రోశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, సయ్యద్ షుజా అనే వ్యక్తి తాను ఈవీఎంలను హ్యాక్ చేసి చూపిస్తానంటూ ప్రకటించాడు. ఈవీఎం ఫ్రీక్వెన్సీని ఐసోలేట్ చేయడం ద్వారా ఫలితాలను మార్చవచ్చని చెప్పాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఐటీ చట్టం కింద నవంబరు 30న కేసు నమోదు చేశారు.
ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఏ ఈవీఎంను అయినా తాను హ్యాక్ చేయగలనని సయ్యద్ షుజా చెబుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కాగా, షుజా ఇవే ఆరోపణలను 2019 ఎన్నికల సమయంలోనూ చేశాడని అధికారులు నిర్ధారించారు. ఈ విషయమై అతడిపై ఢిల్లీలోనూ ఎఫ్ఐఆర్ నమోదైంది.