Encounter: ఎన్ కౌంటర్ పై ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ ప్రకటన
- ఏటూరునాగారం అటవీప్రాంతంలో కాల్పుల మోత
- ఈ ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు
- ఏడుగురు నక్సల్స్ మృతి
తెలంగాణలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో నేటి ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. దీనిపై ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ ప్రకటన చేశారు.
మావోయిస్టులు ఇటీవల వాజేడులో ఇద్దరు అమాయకులను చంపారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లాలో గస్తీ పెంచామని చెప్పారు. ఈ క్రమంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు బృందానికి ఈ ఉదయం మావోయిస్టులు ఎదురుపడ్డారని, పోలీసులను చూసి వారు కాల్పులు జరిపారని ఎస్పీ శబరీశ్ వివరించారు.
లొంగిపోవాలని హెచ్చరించినా కాల్పులు ఆపలేదని తెలిపారు. దాంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కాల్పుల అనంతరం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు గుర్తించామని చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నామని ములుగు ఎస్పీ తెలిపారు.