Blood pressure: ఉదయమే ఈ లక్షణాలు కనిపిస్తే.. అది హైబీపీ కావొచ్చు!
- మారిన జీవన శైలితో చాలా మందిలో అధిక రక్తపోటు సమస్య
- మనకు తెలియకుండానే ఒళ్లును గుల్ల చేస్తున్న హైబీపీ
- దీనివల్ల ఉదయమే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయంటున్న ఆరోగ్య నిపుణులు
- వాటిని గమనించి వైద్య పరీక్షలు చేయించుకుంటే ముందుజాగ్రత్త పడవచ్చని సూచనలు
జంక్‌ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మారిన జీవన శైలి వంటి వాటితో ఇటీవల చాలా మందిలో అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య తలెత్తుతోంది. తొలి దశలో దీనికి సంబంధించి తీవ్రంగా ఇబ్బందిపెట్టే లక్షణాలేమీ కనిపించవు. దీనితో చాలా మందిలో అధిక రక్తపోటు సమస్య తీవ్ర స్థాయికి చేరుతోంది. తెలియకుండానే కిడ్నీ, గుండె వ్యాధులు, మధుమేహం వంటి వాటికి దారి తీస్తోంది. అయితే తరచూ ఉదయం పూట కొన్నిరకాల లక్షణాలు కనిపిస్తే... వారు అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని గమనించి వైద్య పరీక్షలు చేయించుకుంటే ముందుజాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు.
కళ్లు మసకగా కనిపించడం... అధిక రక్తపోటు మొదలైన తర్వాత మొదట మన కళ్లపై ప్రభావం చూపిస్తుంది. కళ్లలోని అత్యంత సన్నటి రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనితో ఉదయమే కళ్లు మసకగా అనిపించడం, ఉన్నట్టుండి చూపు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇలా జరుగుతుంటే.. కచ్చితంగా రక్తపోటును నిర్ధారించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
ముక్కు నుంచి రక్తం కారడం...
కొందరిలో ఉదయం పూట ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. హైబీపీ వల్ల ముక్కులోపల సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోవడమే దీనికి కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఏదో సాధారణ సమస్యగా భావించవద్దని హెచ్చరిస్తున్నారు.
ఉదయమే తీవ్రంగా దాహం వేయడం...
రాత్రిళ్లు సరిగా నిద్రపట్టకపోవడం, ఉదయమే తీవ్రంగా దాహంగా అనిపించి నీళ్లు తాగాల్సి రావడం... అధిక రక్తపోటు లక్షణాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లోని అధిక ఉప్పు కారణంగా... రక్తపోటు పెరుగుతుందని, దానితో తీవ్రంగా దాహం వేస్తుందని వివరిస్తున్నారు.
వికారం, వాంతి వస్తున్నట్టు అనిపించడం...
ఉదయం నిద్ర లేవగానే... వికారంగా ఉండటం, వాంతి వస్తున్నట్టు అనిపించడం కూడా హైబీపీ లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్ర సమయంలో విశ్రాంతిగా ఉండాల్సిన శరీరం... అధిక రక్తపోటు కారణంగా అలసిపోతుందని, దానితో ఉదయమే వికారంగా ఉంటుందని వివరిస్తున్నారు.
నిద్ర లేవగానే తీవ్ర నీరసం... సాధారణంగా నిద్రపోయి లేచిన తర్వాత శరీరం హుషారుగా ఉండాలి. కానీ ఉదయమే తీవ్రంగా నీరసం అనిపిస్తుంటే... అది అధిక రక్తపోటు లక్షణమేనని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ కారణంగా కిడ్నీల్లో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని, రక్తం వడపోత సరిగా జరగదని వివరిస్తున్నారు. దీనితో రాత్రంతా శరీరంలో పేరుకునే వ్యర్థాలు, విష పదార్థాల రక్తంలోనే ఉండిపోయి... తీవ్ర నీరసం ఆవహిస్తుందని చెబుతున్నారు.
- ఇక ఉదయమే చేతులు, పాదాలు, కీళ్లు ఉబ్బిపోయి కనిపించడం... తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, చర్మం దురద పెడుతుండటం వంటివి కూడా హైబీపీ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు.
- అయితే ఇతర అనారోగ్యాల కారణంగా కూడా ఇలాంటి లక్షణాలు ఉండవచ్చని... అందువల్ల వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఏమిటన్నది నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
- ఎట్టి పరిస్థితుల్లోనూ హైబీపీ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దని, అది మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని స్పష్టం చేస్తున్నారు.