HYDRA: లోటస్‌పాండ్‌లో ఎకరం భూమి కబ్జాకు ప్రయత్నిస్తే అడ్డుకున్నాం: హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
- అన్ని పార్టీలకు చెందిన వారు ఆక్రమణలకు పాల్పడ్డారని వ్యాఖ్య
- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందన్న కమిషనర్
- ఆక్రమణదారుల్లో పేదల కంటే ధనికులే ఎక్కువగా ఉన్నారని వెల్లడి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. లోటస్ పాండ్‌లో ఎకరం భూమి కబ్జాకు ఒకరు ప్రయత్నించారని, దానిని హైడ్రా అడ్డుకుందన్నారు. బేగంపేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీలకతీతంగా అన్ని పార్టీలకు చెందిన వారు కూడా ఆక్రమణలకు పాల్పడ్డారన్నారు.
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని వెల్లడించారు. ఎక్కువగా సంపన్నులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో పరిశీలించాక తెలిసిందేమంటే ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదల కంటే ధనికులే ఎక్కువగా ఉన్నారన్నారు. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమిస్తే ఎవరినీ వదిలేది లేదని తేల్చి చెప్పారు.