Kolkata: బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయం: కోల్‌కతాలోని ఆసుపత్రి ప్రకటన
- బంగ్లాలో హిందువులపై దాడులు, భారతీయ జెండాకు అవమానం
- అందుకే బంగ్లా రోగులకు చికిత్స చేయమన్న జేఎన్ రే ఆసుపత్రి
- నిరవధికంగా... చికిత్స చేయబోమని నోటిఫికేషన్
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, దేవాలయాలపై దాడులు, భారతీయ జెండాకు అవమానం నేపథ్యంలో ఆ దేశానికి చెందిన రోగులకు చికిత్స చేసేది లేదని కోల్‌కతాలోని జేఎన్ రే ఆసుపత్రి ప్రకటించింది. బంగ్లాదేశీయులు భారతీయ జెండాను అవమానించారని, అక్కడి హిందువుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రే ఆసుపత్రి అధికారి సుభ్రాంశు భక్త్ నిన్న ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రోజు నుంచి నిరవధికంగా... బంగ్లాదేశ్ రోగులను చికిత్స కోసం చేర్చుకోబోమని నోటిఫికేషన్ జారీ చేశామని, భారత్ పట్ల బంగ్లాదేశీయులు చూపిన తీరు పట్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
బంగ్లాదేశ్ స్వాతంత్రంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించిందని ఈ సందర్భంగా సుభ్రాంశు గుర్తు చేశారు. అయినప్పటికీ భారత వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశీయులు త్రివర్ణ పతాకాన్ని కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.