Vijayawada: విజయవాడలో విషాద ఘటన... యువతి ప్రాణాలు తీసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ!
- ఇన్‌స్టా ద్వారా పరిచయమైన యువకుడిని ప్రేమించిన యువతి
- ఆమె ప్రేమ పెళ్లికి నిరాకరించిన పేరెంట్స్
- మనస్తాపంతో రైవస్ కాలువలో దూకి ఆత్మహత్య
ఏపీలోని విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ ఓ యువతి ప్రాణాలు తీసింది. ఇన్‌స్టా ద్వారా పరిచయమై, ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు పేరెంట్స్ నిరాకరించడంతో యువతి రైవస్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... స్థానిక చిట్టినగర్‌కు చెందిన యువతి (19)కి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. కొంత కాలానికి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అదే విషయం యువతి తన ఇంట్లోవారికి చెప్పింది. కానీ, ఆమె తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. దీంతో ఈ నెల 24న ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. పలుమార్లు ఇంట్లోంచి కూడా వెళ్లిపోయింది. అయినా పేరెంట్స్ పెళ్లికి అంగీకరించకపోవడంతో బుధవారం మధ్యాహ్నం సమయంలో పాత పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోని ఓవర్ బ్రిడ్జి నుంచి రైవస్ కాలువలోకి దూకేసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని, కాలువలో యువతి కోసం జల్లెడ పట్టారు. గజ ఈతగాళ్లతో వెతికించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామవరప్పాడు వంతెన సమీపంలో మృతదేహం లభ్యమైంది.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి పేరెంట్స్‌కు అప్పగించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైన దృశ్యాలు అక్కడి వారిని కలచివేశాయి.