Pravin Amre: 23 ఏళ్ల‌కే పృథ్వీ షా రూ. 30-40 కోట్లు సంపాదించాడు... ఆ డబ్బే అతడి కొంపముంచింది: ప్రవీణ్ ఆమ్రే

Ex Coach Pravin Amre On Prithvi Shaw

  • క్ర‌మశిక్షణ లేకపోవడమే అత‌ని పతనానికి కారణమ‌న్న మాజీ కోచ్ ప్రవీణ్ ఆమ్రే
  • రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన షా అన్‌సోల్డ్‌గా మిగిలిన వైనం
  • అటు ముంబ‌యి రంజీ ట్రోఫీ జట్టు నుంచి కూడా ఉద్వాస‌న‌
  • ఇక జాతీయ జ‌ట్టుకు దూరమై నాలుగేళ్లు దాటిన వైనం
  • అగమ్యగోచరంగా పృథ్వీ షా కెరీర్

యువ క్రికెటర్ పృథ్వీ షా ఇటీవ‌ల జ‌రిగిన‌ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోకుండా వార్తల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. 2024 వ‌ర‌కు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు ఆడిన అత‌డిని ఆ ఫ్రాంచైజీ వేలానికి వ‌దిలేసింది. ఇక రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన షా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 

ఇటీవల ముంబ‌యి రంజీ ట్రోఫీ జట్టు నుంచి కూడా పృథ్వీ షా ఉద్వాస‌న‌కు గుర‌య్యాడు. అటు జాతీయ జట్టుకు దురమై నాలుగేళ్లు దాటిపోయింది. ఇలా ఈ 25 ఏళ్ల యంగ్ ప్లేయ‌ర్ ప్ర‌స్తుతం కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దాంతో పృథ్వీ షా కెరీర్ ప్ర‌స్తుతం అగమ్యగోచరంగా మారింది.  

కాగా, పృథ్వీ షా పతనంపై డీసీ మాజీ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే తాజాగా మాట్లాడాడు. అత‌డు చిన్న వయస్సులో రూ. 30-40 కోట్లు సంపాదించాడని, దాంతో చిన్న వయసులో అంత మొత్తంలో సంపాదించినప్పుడు తప్పకుండా దృష్టి మరలే అవకాశం ఉంటుంద‌ని ఆమ్రే తెలిపాడు. పృథ్వీ షా విష‌యంలో అదే జ‌రిగింద‌న్నాడు. ఒక‌సారి భార‌త మాజీ క్రికెట‌ర్‌ వినోద్ కాంబ్లీ ప‌త‌నం గురించి కూడా షాకు ఉదాహరణగా చెప్పానని, అయితే అది కూడా పని చేయలేదని వెల్లడించాడు.

"మూడేళ్ల కిందట వినోద్‌ కాంబ్లీ గురించి చెప్పాను. నేను కాంబ్లీ పతనాన్ని దగ్గరి నుంచి చూశాను. ఈ తరం కుర్రాళ్లకు కొన్ని విషయాలు నేర్పించడం సులువు కాదు" అని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమ్రే పేర్కొన్నాడు.

"పృథ్వీ షా 23 ఏళ్లకే రూ. 34- 40కోట్లు సంపాదించి ఉంటాడు. ఓ ఐఐఎం గ్రాడ్యుయేట్‌ కూడా అంత సంపాదించరేమో! చిన్న వయసులో అంత మొత్తంలో సంపాదించినప్పుడు తప్పకుండా దృష్టి మరలే అవకాశం ఉంటుంది. అందుకే క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... మంచి స్నేహితులను కలిగి ఉండడం, డబ్బును ఎలా మేనేజ్‌ చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రమశిక్షణ రాహిత్యమే పృథ్వీ కెరీర్‌కు ఆటంకంగా మారింది. తిరిగి వచ్చి బాగా రాణించాలనే కోరిక లోపించింది" అని ఆమ్రే అన్నాడు.

"పృథ్వీ షా లాంటి ప్రతిభవంతుడైన ఆట‌గాడి కెరీర్ రివర్స్‌ డైరెక్షన్‌లో వెళ్లడం చాలా నిరాశకు గురిచేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ముంబ‌యికి వెళ్లే ముందు, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈవెన్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ అద్భుతమైన సెంచరీ సాధించాడని ఎవరో నాకు చెప్పారు. 

ఈరోజు కూడా అతను ఐపీఎల్‌లో 30 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ కొట్టగలడు. షా జీవితం భారత క్రికెట్‌లో ఒక కేస్‌ స్టడీ. అతడికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదు. టాలెంట్ ఒక్కటే ఉన్నతస్థాయికి తీసుకెళ్లదు. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావం అనేవి మనిషికి చాలా ముఖ్యం. పృథ్వీ షా తన అండ‌ర్‌-19 రోజులలో రాహుల్ ద్రవిడ్‌, రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్  వంటి అనేక మంది ప్ర‌ముఖ క్రికెట‌ర్ల నుంచి సలహాలు కూడా అందుకున్నాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది" అని ప్రవీణ్ ఆమ్రే చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News