Team India: టీమిండియా కొత్త వన్డే జెర్సీ చూశారా..?

Harmanpreet Kaur Unveils Indian Cricket Teams New ODI Jersey

  • ముంబ‌యిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కొత్త జెర్సీ ఆవిష్కరణ‌
  • జెర్సీని ఆవిష్కరించిన హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, బీసీసీఐ సెక్రటరీ జైషా
  • స‌రికొత్త డిజైన్‌తో ఆక‌ట్టుకుంటున్న కొత్త జెర్సీ
  • ఆస్ట్రేలియాలో జ‌రిగే వన్డే సిరీస్‌లో కొత్త జెర్సీలో ఆడ‌నున్న భార‌త అమ్మాయిలు

ముంబ‌యిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం టీమిండియా కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. జెర్సీ ముందు, వెనుక దాదాపు పాతవాటిలాగే ఉండ‌గా, భుజాల మీద మాత్రం త్రివ‌ర్ణ ప‌తాక రంగులుండ‌టంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. 

హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు డిసెంబర్ 5 నుంచి 11 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో భార‌త అమ్మాయిలు ఈ కొత్త జెర్సీలోనే బ‌రిలోకి దిగ‌నున్నారు. ఆ త‌ర్వాత‌ డిసెంబర్ 22 నుంచి వడోదరలో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కూడా మహిళల జట్టు కొత్త జెర్సీని ధరించనుంది. 

హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... “ఈరోజు జెర్సీని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాం. జెర్సీ లుక్ చాలా బాగుంది. భుజాల మీద త్రివ‌ర్ణ ప‌తాక రంగు చాలా అందంగా ఉంది. మాకు ప్రత్యేకమైన వ‌న్డే జెర్సీ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. టీమిండియా జెర్సీని ధరించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమేన‌ని హర్మన్‌ప్రీత్ అన్నారు. దానిని సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. భార‌త అభిమానులు కూడా ఈ జెర్సీని ధరించి గర్వపడాలని కోరారు. 

మరోవైపు వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా కొత్త జెర్సీని ధరించనుంది. కాగా, ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 

ఐదు మ్యాచ్‌ల బీజీటీ ట్రోఫీలో ఇప్ప‌టికే పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో భార‌త జ‌ట్టు ఘ‌న వియ‌జం సాధించి, 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు (డే అండ్ నైట్‌) డిసెంబ‌ర్ 6 నుంచి అడిలైడ్ ఓవ‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. అంత‌కుముందు టీమిండియా ఇవాళ్టి నుంచి ప్రెసిడెంట్ ఎలెవ‌న్‌తో రెండు రోజుల వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది.   

  • Loading...

More Telugu News