Mallikarjun Kharge: ఒకరిపై ఒకరం విమర్శలు చేసుకుంటుంటే గెలుస్తామా?: మహారాష్ట్రలో ఓటమిపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
- ఐక్యత లేకపోవడం, పరస్పర విమర్శలు దెబ్బతీశాయన్న ఖర్గే
- కలిసికట్టుగా లేకుంటే ప్రత్యర్థులపై ఎలా పోరాడాగలమన్న ఖర్గే
- ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్న ఏఐసీసీ అధ్యక్షుడు
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ లోతుగా విశ్లేషిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేని రీతిలో ఉన్న పనితీరే పార్టీకి పెద్ద సవాల్‌గా మారుతోందన్నారు.
పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం వంటివి ఎన్నికల్లో పార్టీని దెబ్బతీశాయన్నారు. ఈ విషయంలో క్రమశిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. కలిసికట్టుగా పోరాడకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రత్యర్థులపై మనం ఎలా పోరాడగలమన్నారు.
కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాల నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. పార్టీలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరం ఐక్యంగా ఉండాలని... ఇదే మన ఆయుధం అవుతుందన్నారు. పార్టీ విజయమే తన గెలుపు అని ప్రతి ఒక్కరూ భావించాలన్నారు.
పార్టీ బలంపై మన శక్తి ఆధారపడి ఉంటుందని భావించాలని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహంతో పునరాగమనం చేసిందని, కానీ తర్వాత వచ్చిన మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా లేవన్నారు.
నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇండియా కూటమి పార్టీలు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయని, కానీ పనితీరు మాత్రం ఆశించిన విధంగా లేదన్నారు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సిద్ధం కావాలన్నారు. ఈవీఎంలు ఎన్నికల ప్రక్రియను అనుమానాస్పదంగా మార్చాయని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలను మార్చుకోవాల్సి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల అజెండాను అమలు చేసేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమన్నారు. మహారాష్ట్ర ఫలితాలతో నిరాశ చెందకుండా పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి ఏఐసీసీ వరకు మార్పులు తీసుకు రావాలన్నారు.