Team India: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదు: కేంద్రం స్పష్టీకరణ

MEA said the Indian team is not going to Pakistan
  • వచ్చే ఏడాది పాకిస్థాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ
  • భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదన్న బీసీసీఐ
  • తాజాగా బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన భారత విదేశాంగ శాఖ
పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ, షెడ్యూల్, వేదికలపై ఐసీసీ కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో, భారత కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర ప్రకటన చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లోనే జరిగేట్టయితే భారత జట్టు పాల్గొనదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. 

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వ్యవహారంపై బీసీసీఐ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసిందని, బీసీసీఐ చెప్పినట్టుగానే భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోవడంలేదని తెలిపారు. బీసీసీఐ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్థాన్ లో భద్రతా పరమైన సమస్యలు ఎదురవుతాయని బీసీసీఐ ఆందోళన చెందుతోందని, జైస్వాల్ చెప్పారు. అందుకే టీమిండియాను పాకిస్థాన్ పంపించడంలేదని అన్నారు.

కాగా, టీమిండియా పాకిస్థాన్ వెళ్లడంలేదన్న ప్రకటనల నేపథ్యంలో... హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్ అంటే... కొన్ని మ్యాచ్ లు పాకిస్థాన్ లో, మరికొన్ని మ్యాచ్ లు ఇతర దేశాల్లోని వేదికలపై నిర్వహిస్తారు. 

అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం హైబ్రిడ్ మోడల్ కు తాము అంగీకరించేది లేదని తెగేసి చెబుతోంది. ఈ నేపథ్యంలో, ఇవాళ జరగాల్సిన ఐసీసీ కీలక సమావేశం రేపటికి వాయిదా పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Team India
Champions Trophy 2025
Pakistan
BCCI
PCB

More Telugu News