Errabelli: త్వరలో జమిలి ఎన్నికలు... కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారు: ఎర్రబెల్లి

Errabelli says KCR will become CM soon
  • కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్న ఎర్రబెల్లి
  • బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడొద్దు... త్వరలో కేసీఆర్ సీఎం అవుతారని వ్యాఖ్య
  • రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారన్న మాజీ మంత్రి
త్వరలో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని... కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలు చాలా బాధపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడవద్దని... కేసీఆర్ మరోసారి సీఎం అవుతారన్నారు.

బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ సందర్భంగా వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ... జమిలి ఎన్నికలు వస్తున్నాయని... అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. మన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

రాష్ట్రంలో ఎన్నో హాస్టళ్లు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం పాలనను గాలికొదిలేసి తన పార్టీ నేతలతో ఢిల్లీకి వెళ్లి వస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తీరును ప్రతి ఒక్కరు గమనిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు.

వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలిదేవత సోనియా గాంధీ అని విమర్శించారు. సోనియాను నాడు బలిదేవత అన్నది రేవంత్ రెడ్డేనని... ఇప్పుడు మాత్రం దేవత అంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. త్వరలో తుపాకీ రాముడి తుప్పు వదలగొడతామన్నారు.
Errabelli
BRS
Congress
KCR

More Telugu News